హుద్ హుద్... ఎంత అప్రమత్తంగా ఉన్నా, దాని ఉనికిని చాటుకుని గానీ సద్దుమణగలేదు. వైజాగ్ నగరాన్ని చూస్తుంటే మళ్ళీ తేరుకోగలదా...? అన్న ప్రశ్న రేకెత్తుతుంది. జరిగిన నష్టం అంతా, ఇంతా కాదు, అసలే రాష్ర విభజన, అందునా కొత్త ప్రభుత్వం, అందునా అప్పులు.... ఈ సర్దుబాట్లకే నడ్డి విరుగుతుందిరా దేవుడా అంటే మూలిగే నక్క పై టెంకాయ పడ్డట్టు.. ఈ ప్రకృతి వైపరీత్యమొకటి...
ప్రభుత్వం ధైర్యంగా నిలిచినా, దాతలు తమ చేతనైన సాయం అందించినా, కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకు రావాలంటే దశాబ్దం పడుతుందేమో.. ఎవరు ముందుకు వచ్చి సాయం చేయదలుచుకున్నా, మహా అయితే అయ్యో పాపం అంటారేమో, సమయానికి అన్నం ప్యాకెట్లు పంచుతారేమో... కానీ నిజంగా వైజాగ్ నగర వైభవానికి పడ్డ చిల్లును పూడ్చే పవరెవరికుంది...? వైజాగ్ నగరం భారత దేశంలోని గుర్తింపు ఉన్న వాణిజ్య నగరాల్లో ఒకటి... అది ఇక చరిత్రలా మారనుందా....? హుద్ హుద్ కేవలం వైజాగ్ నేనా..? లేక సమస్త తెలుగు జాతినా...?
మరీ కష్టమైన ప్రశ్నేం కాదు, ఏ ప్రాంతానికి నష్టం వాటిల్లినా అక్కడి వారికే కదా బాధ.... అయినా పెద్ద మనసుతో ముందుకు వచ్చి సమయానికి ఆదుకున్నారు. ప్రముఖ టి. వి. చానళ్ళు కూడా ఓ మోస్తరు ధనాన్ని సమకూర్చి పెట్టాయి. ఇది చాలదూ.. మనవాళ్ళ లోను మానవత్వం ఉంది చాటడానికి.... మానవత్వం ఉంది అనుకోవడానికి ఇది నిజంగానే చాలు.. కానీ వైజాగ్ నగరం నాది అనుకున్నవాడికి అది చాలలేదు... రెండున్నర గంటలు అలరిస్తేనే ‘అభిమాని’ అని ఓ టైటిల్ వేసుకుని సినిమా రిలీజైన ప్రతిసారి, ఎండనక, వాననక దగ్గరుండి నడిపించే నా వాడికి నేను చేసిందేంటి అని ఆలోచించిన వాడికి అది సరిపోలేదు.... అందుకే కేవలం వెండి తెర మీదే కాదు, సదా వైజాగ్ వాసుల గుండెల్లో నిలిచిపోవాలి అని ప్రతిన పూనారేమో... విప్లవంలా కదులుతున్నారు... ఈ సారి నటించడానికి కాదు, వైజాగ్ వాసుల బ్రతుకు సమరంలో వెలుగు నింపడానికి.. మీరు పడుతున్న యాతనలో మేము సైతం మీకు తోడున్నాం అని కార్య రూపంలో చూపడానికి, చేతనైన సాయం చేయడానికి, అన్నింటికీ మించి మీరు ఒంటరి కాదు అని మరోసారి వారి వెన్నుతట్టడానికి.. నిస్స్వార్థంగా కేవలం వైజాగ్ వాసుల సహాయార్థం సినీ పరిశ్రమ చేస్తున్న ఈ సాయం... వైజాగ్ వాసుల మనసులో జీవితాంతం నిలిచిపోవడం ఖాయం.
నవంబర్ 30 న పవన్ కళ్యాణ్, నాగార్జున, మహేష్ బాబు, చిరంజీవి, సూర్య, గోపీచంద్ లతో పాటు మొత్తం సినిమా ఇండస్ట్రీ We Love Vizag అనే ట్యాగ్ లైన్ తో పన్నెండు గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం కాబోతున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని, తమ వంతు సాయం చేయాలని కోరుకుందాం... ఎంతైనా మన వైజాగ్ కదా...
మేము సైతం – We Love Vizag November 30 న జరుగుతున్న ఈ కార్యక్రమంలోని హైలెట్స్
- సంగీత ప్రముఖులచే పాటలు,
- తెలుగు సినీ జగత్తును ఏలుతున్న ప్రముఖ తారలతో డ్యాన్స్
- ప్రముఖ డైరెక్టర్ల పర్యవేషణలో ప్రముఖ తారలతో ఎంటర్ టైన్ మెంట్ షో
- తారల సూపర్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్
- సినీ తారలతో రెడ్ కార్పెట్ చారిటీ డిన్నర్
- మెగా లాటరీ టికెట్, గెలిచిన వంద మందికి బహుమతులు.
- సినీ తారలతో తంబోలా ఆడే అద్భుత అవకాశం.
No comments:
Post a Comment